కవిత లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కవిత లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, డిసెంబర్ 2009, మంగళవారం

కవిత

మదిలోని భావాలు
హృదయపు లయలో
అక్షర రూపమై జాలువారగ
వికసించిన పదాల కుసుమాల
సుమమాలిక కవిత

సునిశిత కనులు తెలిపే
తేటతెల్ల తలపులు
ఇంపైన శైలిలో ఒదగగా
పలికే అభినయ
వర్ణమాల కవిత

ఉహలకందని ఆలోచనలకు  
చలనమిచ్చి
ఆ రూపానికి జీవం పోసి
ప్రవహించే ప్రేరణై
హృదయాలను కలిపే వంతెన కవిత

21, డిసెంబర్ 2009, సోమవారం

కాలమా! కాస్త ఆగుమా!

వినీల ఆకాశమున
వెలిగే తారకల నడుమ
విరబూసిన అందాల చంద్రిక
శశిరేఖ వేడిమి వెన్నెల కాంతుల హాయిలో   

కృష్ణవేణమ్మ గలగలల జోలాటకు 
ఓ చిరు గాలి తోడు రాగ
కొబ్బరాకు అంచున సేదతీరిన ఓ నీటి బొట్టు
జారు వారి తనువును పులకరించి మైమర్చగా
చేరుకున్న నిదురానగరిలో

మల్లెల మాలాల ఒదిగిన చిరునవ్వు
తేనల ఝరి కారు పలుకులు
ఒయ్యారాలెన్నో ఒలకు నర్తనతో
చారు చక్కని కలువకంటి
నా కలల రాకుమారిని చేరుటకు

స్వప్నాల సోపానాలు ఆరోహించి 
నిక్కల ఫలము అందుకొనుటకు
తెరువు తెలుసుకొను ఈ సమయాన
కాలమా! నువ్వు ఆగుమా!

పొద్దు వాలుటకు అంత తొందరేలమ్మా
తరుణి చెంత లేని తరణి రాక నాకెందుకమ్మా
కాలమా! కనికరించి కాస్త ఆగుమ!

సందెరేళ, సాగర తీరపు మేఘాల చాటున
దొబూచులాడుతున్న భానుడి మందార వెలుగుల్ని
ముడివేసుకున్న కుసుమాల పరిమళములతో
ఇంపైన మారుతం చలించు ఉల్లాసప్పు ఉయ్యాలలో

ఆహ్లాదపు అంచులు తాకుతూ
విచ్చుకున్న కేరింత తుల్లింతలతో
ఉప్పొంగిన సొగసుల కొలనులో
అందాల సుమాళియై విహరిస్తున్న
నా ఆశల తుషార అలివేణి తలంపులలో తడుస్తున్న
నా హుషారు జోరు అందుకుని పరుగులు పెట్టక
కాలమా! కాస్త ఆగుమా!

నా జ్ఙాపకాల జల్లును ఆవిరి చేసి
అరుణిమ అందాల సవిత్రను దూరం జరిపి
చంద్రకాంతి లేని రేయి
ఊహలు దిగి రాని, విలాసం తెలియని చెలి
కలవరింపులల జాగరిల్లు దండన నాకు ఏలనమ్మా!
ఓ కాలమా! కాస్త ఆగుమా!
నా కనులలో, అసువులో కటిక చీకటిని నింపకుమ!  

13, డిసెంబర్ 2009, ఆదివారం

పూల వనం

రంగురంగుల పూలతో కళకళలాడుతున్న పూలవనం 
ఒకటే నైజం కలిగిన రకరకాల కుసుమాల మైత్రితో ప్రకాశిస్తున్నరమణీయ నేల
పూలజాతులు వేరైనా, పలికే సువాసనలు ఎన్నున్నా  
తమలో పారే అంకురం ఒకటిగా, ఐక్యమైన అంతరాత్మతో వికసిల్లుతున్నఅనురాగాల మాగాణి 

కొలిచే భగవంతుడు వేరైనా, పూజించే విధానం ఏదైనా 
అందరి మనోగతం ఒకటే, అభిమతం ఒకటే 
తమతో పాటు సమేతంగా అందరి వికాసం కోరి 
విఘ్నాలను వీగి విరియుటకు ఆశీస్సు పొందుటకే  

మౌలిక ప్రవృతి ఒకటే అయినా       
రంగో పరిమళమో లేదా మరే తరముల వలనో కొత్త వర్గముల మొగ్గలు పుట్టినా    
ప్రత్యేకిత సంతరించుకున్నా, పుచేది ఈ ప్రసూనాల తోటలోనే, భాసిల్లేది ఈ పూలవనపు సుమగానే
అది లేనిపోని కట్టులతో వాడి రాలనంత వరకే

పువ్వు తన పరిమళ్ళాన్ని నలుదిక్కులా వెదజల్లగలిగేది 
తడి ఆరని రూపుమార్పని నీడ కలిగి 
ఓ చెంతకు వాలిపోనీయక, సరళంగా నిలపగలిగే పవనం తోడైనప్పుడే
ఏ యోచనా లేక ఒక మొగ్గా తెమ్పబడనంత వరకే, చులకన కానంతవరకే


ఇక్కడ భారత దేశాన్ని పూలవనం గా ఊహించుకున్నానని గమనించగలరు

3, డిసెంబర్ 2009, గురువారం

తెల్లని మనస్సు

కలలో మెదిలే నీ రూపురేఖలను
నా చేతి రేఖలతో ముడిపెట్టాలని తలిచా!
కరిగి విడిచి పోకూడదని!
కానీ విధి చిత్రమైనది!

వాలుక పై నీ పాదముద్రల చుట్టూ
వాలు గోడనవ్వాలనుకున్న!
ఆ గుర్తులు చెరగరాదని!
అంతలోనే అలలు నిన్ను ముద్దాడి తీసుకుపోయాయి! 

నీటిపై గీసిన నీ చిత్రాని
ఛత్రమై కాపాడుతున్న!
ఎండకు ఆవిరైపోకూడదని!
ఇట్టే పుట్టి పగిలే నీటి బుడగ మాయ తెలియక!

విరబూసిన నీ చిరుహాసాన్ని
కలబోసుకున్న పవనం నుండి
నేను తీసుకున్న శ్వాసను వదలక నాలోనే బంధించా!
ఆ నవ్వుల ఊసులైన నాతో వుండి పోవాలని!

*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*

నీ చిరునవ్వులలో రాలిన ముత్యాలతో రాసుకున్నా
నీతో నా ప్రతీ జ్ఞపకాన్ని!
ఎప్పటికీ అలా భాసిల్లాలన్ని!

ఆ చుక్కలను ఏరి, కూర్చి
నీ రేఖాచిత్రాన్ని చిత్రీకరించా! 
అన్ని తారకలు కలబోతగా ఇచ్చే తేజం నీదన్ని!

పాలతో కడిగి మల్లెపూవ్వుల సొగస్సు అద్దా
నీ బింబంలో నైనా నువ్వు కందిపోకూడదని!

కానీ నా తెల్లని కాగితంపై నీ గుర్తులు ఏవి?
ఆ పొగ మంచు కప్పేసిందా!