వీనుల విందు, సిరివెన్నలల వినుకెంపు, కస్తూరి పరిమళము
చెవులకు కెంపు, వినసొంపు, చక్కెర పాకము
సరళ అజిత, శ్రావ్య వాహిని, సుధలొలికె శబ్ద సంపద
అమ్మచేతి ముద్దలోని ప్రేమ, కంటి వెలుగు అందం
కళవళికల మేళవింపు మన తెలుగు
అమృతం ఎందుకు దండగ!
తెలుగు కవితని చదివి ఆ రుచిని పొందక!
ఏవో సొంపులను, ఎన్నో సొగసులను చూడాలన్న తపనను కలలోనైనా కనటమెందుకు!
గుండ్రపు లిపిలో, అందమైన శిల్పాలు కూడా మైమరిచిపోయేల
ముత్యాలాంటి అక్షరాలు మల్లెల పరిమళంతో కూడిన పదాలై తెలుగుననుండగా!
పారిజాత పుష్పాని అందుకోవాలని కోరికెందులకు? మరువు!!
తేట తెలుగు మాటలతో దేవతలనే ఆశ్చర్యపరిచే తేనెలొలకు మానును నిర్మించు!
శిలలను సైతం కరిగించు శక్తున్న సంగీతమునకు
తన తీయని పదాలతో స్వరానికి భావాన్ని కూర్చి మరింత శక్తిపరుచు శక్తివంతమైన భాష తెలుగు.
తెలుగు నేలపై, తెలుగు తల్లికి పుట్టిన మనకు
దేవుడు ప్రత్యక్షమై వరము ప్రసాదించినచో ఇంకేమి కోరుకుంటాము!
మన మరల జన్మనూ, ఇదే తల్లికి, ఇదే నేలపై ఇవ్వమని అడగక!
తెలుగంటే ఇష్టము, కాదు కాదు ప్రాణము కనక!
సువర్ణ కాంచనములకైన కేవలం ఒకటే రంగు, ఒకటే నైజము
కానీ, రకరకాల మాండలికములలో సందర్బానుసారం పదముల అర్ధములు మారు నమ్రముతో,
వివిధ యాసలుతో వేటికవ్వే సాటిగా ప్రకాశించు పైడి రత్నాల వర్ణాల విల్లు, మన తెలుగు.
ఇంత వైవిధ్యమున్నభాష యందు ప్రామాణికం మాదంటే మాదంటూ మనలో మనం భిన్నత్వానికి పోక
పర భాష మోజులో అణగారిపోతున్న తెలుగు భాషను ఏకత్వంతో కాపాడుకుందాం.
ఛందస్సు, అలంకారాలు మొదలగు వ్యకరణాంసాలు తగినరీతిలో అద్భుతంగా అమరిన కావ్య ఐశ్వర్యాలు
రమణీయమైన జాతీయాలు, నుడికారాలతో తమ ప్రత్యేకత ఏదైనా, నిర్దిష్టమైన ప్రయోజనాన్ని కలిగున్నఎనలేని అప్పుర్వ సాహిత్య సంపద తెలుగు సొంతం.
కాలానుసారం, ఇతర భాషా పదాలను తనలో కలుపుకునే ఉదారత్వముతో, సంస్కారపూర్వమైన భాషయ్యి
సులభమైన ఉచ్చారణతో, శ్రావ్యతకు మాధుర్యమై, సుందరమైన లిపిలోనున్న తెలుగు భాష
భారతదేశమున అనధికారంగా అత్యధికులు మాట్లాడే రెండో భాషగా,
ద్వితీయ జాతీయ భాషకు హోదాకు వరుసలోనున్న ప్రధమ బాస
అట్టి సౌజన్య వాణి, లావణ్య వేణి మన మాతృభాష తెలుగును మాట్లాడుటకు చిన్నబోవక
నలుగు పెట్టి వదిలించు నీ పరభాషా పాకము!
సొంత భాష ఘనతను, హాయిని తెలుసుకుని నువ్వు మాట్లాడుతూ, మరొకరికి నేర్పించి మాట్లాడిస్తూ తలయెత్తి గర్వపడు
తెలుగును గౌరవించి ప్రేమించు, పులకించు!
పాఠశాలలో నేర్చుకున్న "మా తెలుగు తల్లి కి మల్లె పూదండ" పాట నుండి నిన్నటి "తల యెత్తి జీవించు తమ్ముడా" పాట వరకు విన్న పాటలు, మాటలు, చదివిన పుస్తకాల ప్రాబల్యంతో నా మదిలోని భావాలు ఇలా రూపుదిద్దుకున్నాయి. తప్పులుంటే క్షమించి, సరిచెయ్యండి.